అయ్యప్పస్వామి గురించి

అయ్యప్పస్వామి జననం- చరిత్ర

మదురై, తిరునల్వేలి, రామనాథపురంలను కలిపిపాండ్య దేశాన్ని పాలించిన నాయక్కర్లు వల్లియూర్, తెన్కాశి, సెంగోట్టై, అచ్చణ్ కోవిల్, శివగిరి లలో కూడా నివశించే వారు. పాండ్యులు తమ రాజ్యాన్ని తిరువనంతపురం దాకా విస్తరించారు.  దాదాపు 800  సంవత్స్రాలక్రితం చెంపళనాట్టు కోవిల్, శివగిరి, పందళం ప్రాంతాలను ట్రావన్కూర్ రాజుకు పాలించమని ఇచ్చారట, పాండ్యులు. శ్రీ అయ్యప్పను పెంచిన రాజశేఖరుడు, ఈ వంశానికి చెందినవాడు.
రాజ్యం చిన్నదైనా ఆ రాజశేఖరుణ్ణి ప్రజలు చాలా ఇష్టపడేవారు. అతని పాలన ఒక స్వర్ణయుగంగా భావింపబడింది. ఆ రాఅజుకు ఒక కొరత ఉండేది. ఆయనకు పిల్లలు లేరు. ఆయన తర్వాత రాజ్యానికి ఉత్తరాధికారి లేడు. రాజు, ఆయన భార్య చేసేది లేక ప్రతిరోజు పిల్లలకోసం పరమశివుణ్ణి వేదుకొనేవారు.

అదే సమయంలో మహిషాసురుడనే అసురుడు ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సు వల్ల బ్రహ్మకు అతణ్ణి భూముమీద ఎవరూ చంపలేరనే వరం ఇవ్వవలసి వచ్చింది. ఆవర ప్రభావం వల్ల వచ్చిన బలం, ధైర్యాలతో ఆ అసురుడు మానవుల్ని, మునుల్ని బాధించి చంపటం మొదలు పెట్టాడు. అతనికి భయపడి ప్రజలు దూరప్రాంతాలకు పారిపోయారు. అసాధారణ శక్తి మాత్రమే ఆ అసురుణ్ణి చంపగలదని అందరూ దుర్గాదేవిని ప్రార్థించారు. ఆవిడ ఆ రాక్షసుణ్ణి వధించింది.

తన అన్న వధకు బదులు తీర్చుకోవాలన్న తీవ్రకోరికతో మహిషి, ఘోరతపస్సు చేసి బ్రహ్మను శివ,విష్ణులకు జన్మించే పుత్రుడు తప్ప తన్ను ఎవరూ చంపలేరనే వరం కోరింది. మహిషి అమరలోకానికి వెళ్ళి దేవతలను బాధించండం మొదలు పెట్టాక, వాళ్ళు విష్ణు మూర్తిని రక్షించమని కోరారు. శివ, విష్ణువుల పుత్రుడు తప్ప ఎవరూ మహిషిని వధించలేరన్న విషయం తెలిసిన విష్ణువు, దేవతలకు అమృతం పంచిన నాటి మోహిని అవతారాన్ని ధరిస్తాడు. శివ, విష్ణువులు తమకు జన్మించిన బాలుడిని, శివభక్తుడైన పందల రాజు రాజశేఖరుడికి పెంచుకోదానికి ఇవ్వాలని నిశ్చయించి అలాగే చేస్తారు.

రాజశేఖరుడు ఒకనాడు వేట పూర్తి చేసుకొని, పంపానది తీరంలో అడవిలో ప్రకృతి సోయగాన్ని చూస్తూ తిరుగుతూండగా ఒక పసి బాలుడి ఏడుపు వినిపించింది. ఆ ఏడుపును విని అటు వెళ్ళిన రాజుకు కాళ్ళు, చేతులు ఆడిస్తూ ఏడుస్తున్న అందమైన బాలుడు కనిపించాడు.

రాజు అక్కడ అలాగే స్థంబించినట్లు నిలబడి పోయాడు. ఆ పిల్లాడిని తనతో అంతః పురానికి తీసుకెళ్ళాలని అనుకొన్నాడు.  రాజశేఖరుడు పిల్లవాడిని ఎత్తుకోగానే ఎక్కడి నుంచో ఒక సన్యాసి ప్రత్యక్షమయ్యి, ఆ పిల్లాడిని తీసుకొని వెళ్ళమని చెప్పాడు. అంతే కాదు, ఆపిల్లవాడు ఆ రాజు వంశంలో ఉన్న అన్ని కష్టాలను తీరుస్తాడనీ, ౧౨ వయస్సు వచ్చిన తర్వాత ఆ బాలుడి దైవత్వం గురించి తెలియ వస్తుందని చెప్పాడు. ఆ బాలుడి మెడలో ఒక బంగారు గొలుసు ఉన్న కారణంగా అతడికి ’మణికంఠుడు’ అని నామకరణం చేయమని కూడా చెప్పాడు.  రాజశేఖరుడు ఆ బాలుడిని ఇంటికి తీసుకెళ్ళి భార్యకు  వివరాలన్నీ చెప్పాడు. వాళ్ళిద్దరూ తమను శివుడు కటాక్షించాడని ఎంతో ఆనందించారు. రాజదంపతుల ఆనందాన్ని అందరూ పంచుకొన్నారు, కాని, రాజు తర్వాత తానే రాజవాలన్న కుతంత్ర బుద్ధిగల దివాన్ మాత్రం సంతోషపడ లేదు. అయ్యప్ప చాలా తెలివైనవాడు. చలాకీ అయినవాడు.  తన బుద్ధితో అన్ని కళలలోను అస్త్ర, శస్త్ర విద్యలలోను ఆరితేరి గురువును ఆశ్చర్యపరిచేవాడు, అయ్యప్ప తన దైవశక్తితో. పందళంలో  శాంతి, సౌఖ్యం, శ్రేయస్సులు నిండి ఉన్నాయి.  అయ్యప్ప గురువు ఆ పిల్లవాడు మామూలు మానవమాత్రుడు కాడనీ, దైవాంశసంభూతుదనీ అనుకొన్నాడు. అయ్యప్ప విద్య పూర్తి కాగానే, గురువు గురుదక్షిణ ఇచ్చి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలనుకొన్నాడు.

తన గురువు ఆశీస్సులకోసం వెళ్ళిన మణికంఠకు, గురువు తాను అయ్యప్ప గురించి అనుకొంటున్నది తెలిపాడు. అయ్యప్ప దైవాంశ కలిగిన వాడని తెలుసుకొన్నానని తెలిపి, తన గుడ్డి మూగ కొడుకుఉను కాపాడమని అడుగుతాడు.  మణికంఠుడు గురువు కొడుకు తలమీద చేయి పెట్టగానే ఆ పిల్లవాడికి చూపు, మాట వస్తుంది. ఈ అద్భుతాన్ని ఎవరికీ చెప్పనని గురువు దగ్గర మాట తీసుకొన్న అయ్యప్ప అంతఃపురానికి తిరిగి వెళతాడు.
ఎంతో ఆనందంతో రాజశేఖరుడు అయ్యప్పను అంతఃపురానికి తీసుకొని వెళ్ళి భార్యకు జరిగినదంతా చెప్తాడు. వాళ్ళిద్దరూ ఆ పరమశివుడు తమను అనుగ్రహించాడని ఆనందిస్తారు. దివాన్, తన ఆశలన్నీ ఫలించక పోవటంతో రాణి దగ్గరకెళ్ళి, ఆమె కొడుకు బతికి ఉండగా మణికంఠుడు రాజ్యాన్ని చేపట్టడం సరి కాదని అర్థశాస్త్రం చెప్తోందని చెప్తాడు. రాణిని అనారోగ్యం నటించమనీ, తాను రాజ వైద్యుడి చేత ఆడపులి పాలతో మాత్రమే ఆ తలనొప్పి పోతుందని చెప్పిస్తానని అంటాడు. తన కొడుకు మీది మమకారంతో కళ్ళు మూసుకు పోయిన రాణి, దివాన్ కు సహకరిస్తానని చెప్పి, భరించలేని తలనొప్పితో బాధపడుతున్నట్లు నటిస్తుంది. రాజు ఆమె అనారోగ్యానికి బాధపడి వైద్యులను పిలిపిస్తాడు. దివాన్ హెచ్చరించినట్లుగానే వైద్యుడు రాణి తలనొప్పి తగ్గాలంటే ఈనిన పులి పాలు కావాలంటాడు. రాజు వెంటనే ఆమె నొప్పి తగ్గడానికి పాలు తెచ్చిన వ్యక్తికి సగ రాజ్యం ఇస్తానని దండోరా వేయిస్తాడు.
రాజుగారు కొంతమంది భటులను ఈనిన పులి పాల కోసం అడవికి పంపుతాడు, కాని, వాళ్ళు ఉత్తచేతులతో తిరిగి వస్తారు. మణికంఠుడు తాను వెళ్తానన్నా, రాజు అతని లేతవయసుని, త్వరలో జరగబోయే పట్టాభిషేకాన్ని  గురించి చెప్పి అతన్ని వెళ్లవద్దంటాడు. మణికంఠుడు తనకు ఒక సహాయం చేయమని మాట తీసుకొని తాను అడవికి వెళ్ళి పులి పాలు తెస్తానని వెళ్ళే అనుమతి పొందుతాడు. రాజు అతనితో బలమైన ధైర్యవంతులైన సైన్యాన్ని పంపడానికి ప్రయత్నిస్తాడు. మణికంఠుడు ఇంతమంది అలికిడి వింటే పులి పారిపోతుందని చెప్పి ఒప్పిస్తాడు. రాజశేఖరుడు చివరు తన ప్రియపుత్రుడిని అడవికి పంపుతూ, అతన్ని తిండిపదార్థాలు, మూడు కళ్ళున్న కొబ్బరికాయలు శివుడికి అర్పించడానికి తీసుకెళ్ళమని చెప్తాడు.

శివుని పంచభూతాలు మణికంఠుని వెన్నంటేశివుడి ఆజ్ఞ మేరకు అడవికి వెళతాయి. అడవికి వెళ్ళే దారిలో మహిషి చేస్తున్న దురాగతాలను మణికంఠ అమరలోకంలో చూస్తాడు. ధర్మమార్గాన్ని ఇష్టపడే మణికంఠుడు, మహిషిని భూమి మీదకు నెట్టివేస్తాడు. ఆమె అళుదానది ఒడ్డున పడిపోతుంది. పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మణికంఠుడు మహిషిని కింద పడవేసి ఆమె గుండెలమీద తాండవం చేస్తాడు. ఆ తాండవానికి భూమ్యాకాశాలు దద్దరిల్లి పోతాయి. దేవతలు కూడా భయపడి పోతారు. మహిషికి తన మీద తాండవమాడుతున్నది హరి హరుల కొడుకని అర్థమయి అతణ్ణి శ్లాఘించి మరణిస్తుంది. ఆ తాండవాన్ని శివ, విష్ణువులు ఇద్దరూ కాళకట్టి అనే స్థలం నుంచి చూస్తారు. ( ఆమె కవలన్, కరంబన్ ల పుత్రిక. వాళ్ళకు మహిషి తల ఉండేది. వాళ్ళకు పుట్టిన ఆమె, తన శాపాన్ని శ్రీధర్మ శాస్తా వల్ల పోగొట్టుకొని, ఆయనతో పాటు శబరిమలలో మాళిగపురత్తమ్మ పేరుతో నెలకొని ఉంది.)

మహిషితో యుద్ధం తర్వాత మణికంఠుడు పులి పాల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ అతనికి శివుడు దర్శనమిస్తాడు. మణికంఠుడు భూమికి వచ్చిన ప్రధాన ఉద్దేశం పూర్తయినా మరొక ముఖ్యమైన లక్ష్యం ఉందని చెప్తాడు. మణికంఠుడికి శోకిస్తున్న తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి గుర్తుకొస్తారు. అతనికి ఇంద్రుడు ఈనిన పులి పాలు సంపాదించడంలో సహాయ పడతాడని చెప్తాడు. మణికంఠు పులి రూపం ధరించిన ఇంద్రుడితో, ఆడపులులు వేషంలో దేవతాస్త్రీలు, పులుల వేషంలో దేవతలు వెంట రాగా అంతఃపురానికి బయలు దేరతాడు.

పందళంలోని ప్రజలంతా ఆ బాలుడు అన్ని పులులతో రావడం చూసి భయపడి దాక్కుంటారు. మొదట రాజశేఖరుడికి కనిపించి బాలుడుని తీసుకోమని చెప్పిన సన్యాసి వచ్చి, మణికంఠుడి  జన్మ రహస్యాన్ని తెలియ చేస్తాడు. దాంతో రాజ్యం అంతా ఆశ్చర్యంలో మునిగి పోతారు. రాజు మణికంఠుడు పులి మీద రావటం చూసి ఆశ్చర్యంతో నిలుచుండి పోతాడు. మణికంఠుడు పులిమీదనుంచి దిగి రాణికి వచ్చిన తెలియని రోగానికి మందైన పులి పాలు తెచ్చానని చెప్తాడు. ఆపుకోలేని రాజు ఆబాలుడి పాదాలమీద పడ్డాడు. తన భార్య చేసిన మోసం ఆమె అనారోగ్యం నటన అని తెలుసుకొని, పడిన బాధను వివరిస్తాడు. మన్నించమని, తన భార్య కారణంగా అడవికి వెళ్ళవలసి వచ్చినందుకు చాలా బాధపడతాడు. అడవినుంచి తిరిగి వచ్చిన రోజు మణికంఠకు 12 ఏళ్ళు వస్తాయి.

రాజు, మణికంఠుడు అడవికి వెళ్ళడానికి కారణమైన దివాన్ ను శిక్షించాలని అనుకొంటాడు. మణికంఠ అతన్ని వారించి, అంతా దైవేచ్ఛతోనే జరిగిందనీ, జరిగిన దానికి కారణముందనీ చెప్తాడు. అంతే కాకుండా తాను దేవలోకం నుంచి భూమికి వచ్చిన పని పూర్తయ్యిందనీ, తానిక దేవలోకానికి తిరిగి వెళ్ళిపోవాలనీ వివరిస్తాడు. వెళ్ళిపోయే ముందు రాజశేఖరుడి భక్తికి, ప్రేమకు మెచ్చి అతను కోరుకొన్న వరమేదైనా సరే ఇస్తానంటాడు. రాజశేఖరుడు తాను మణికంఠుని గుర్తుగా ఒక గుడి కట్టాలనుకొంటున్నాననీ, దానికి తగిన స్థలమేదో నిర్ణయించి ఇమ్మనీ అడుగుతాడు. మణికంఠుడు ఒక అమ్మును వేస్తాదు, అది శబరి అనే చోట పడుతుంది. అది రామాయణకాలంలో శబరి రాముడి కోసం తపస్సు చేసినచోటు. మణికంఠుడు తాను అంతర్ధానమయ్యాక అక్కడ గుడి కట్టమని చెప్తాడు. తర్వాత రాజశేఖరుడు, అగస్త్యముని ఆధ్వర్యంలో సలహాతో అక్కడ గుడి కడతాడు. మణికంఠుడు, తాను సౌమ్యమైన ఏ ఆడంబరాలు లేని బ్రహ్మచర్య వ్రతాన్ని 41 రోజుల పాటు ఆచరించే భక్తులను కరుణిస్తానని మాట ఇస్తాడు. వ్రత కాలంలో భక్తులు మాలధరించి, అడవి మార్గంలో గుడి చేరడానికి నడిచే టపుడు, తలమీద మూడు కళ్ళున్న కొబ్బరికాయ, తినడానికి కొన్ని పదార్థాలు కలిపి కట్టిన ఇరుముడిని తలపై ధరించి, పంపలో స్నానమాడి, వరసగా ప్రయాణ మార్గమంతా ’శరణం’ పలుకుతూ, తానుపులికోసం అడవికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడో అలాగే రవాలని కోరుతాడు. ఆతర్వాతే 18 మెట్లు ఎక్కాలని కోరాడు.

రాజశేఖరుడు మణికంఠుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకొన్నప్పుడు – శ్రీ అయ్యప్ప చెప్పిన మాటలు ఆయనకు గుర్తు వచ్చాయి – పంపానది గంగలా పుణ్యనది, శబరిమల కాశిలా పుణ్యక్షేత్రం. అప్పుడు ధర్మశాస్తా, సముద్రం నుంచి శబరిమలదాకా భూమిని చీల్చిన పరశురాముడిని పిలిచాడు. పరశురాముడు వచ్చి, విగ్రహాన్ని చెక్కి మకరసంక్రాంతి నాడు ప్రతిష్టించాడు.

ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు, మాలధరించి, ఇరుముడి మోసుకొని, పంపలో స్నానమాడి, శరణఘోషతో శబరిమల చేరి ఒక్క సారి శ్రీధర్మశాస్తాను, మణికంఠుని దర్శించాలన్న కోర్కెతో 18 మెట్లెక్కి వస్తుంటారు.